ఖమ్మం, న్యూస్‌లైన్ : పదిజిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం, భద్రాచలం తెలంగాణలోనే ఉండేట్లుగా నిర్ణయించడంతో జిల్లావాసులలో ఆనందం మిన్నంటుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలవారు సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు అలాయి బలాయి తీసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ తల్లివిగ్రహాలకు పూల మాలలు వేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.
ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్, మహిళా విభాగం, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాణ సంచా పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ర్యాలీ నిర్వహించారు. జడ్పీ సెంటర్‌లో మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులు కోటా గురుమూర్తి, మానుకొండ రాధాకిషోర్ తదితరులకు స్వీట్లు తినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జేఏసీ, విద్యార్థి సంఘాలు జడ్పీ సెంటర్, కలెక్టరేట్ ముందు సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వస్తోందని ఉద్యమ సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరపాటి రంగరాజు, ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, రమణయాద్, వల్లోజు శ్రీనివాసరావు, జీఎస్ ప్రసాద్, కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వీట్లు పంచుకున్నారు. ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముర్రేడు బ్రిడ్జి మీదినుంచి ర్యాలీ బస్టాండ్ సెంటర్ వరకు చేరుకోగా అక్కడ సంబరాలు జరిపారు. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళి జోహార్లు అర్పించారు. పాల్వంచలో టీఆర్‌ఎస్ నాయకులు కంచెర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
సత్తుపల్లిలో కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్‌చేశారు. విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని పలువురు వక్తలు అన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్‌ఛేశారు. స్వీట్లు పంచుకున్నారు. టీ జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రభాకర్, ముబారఖ్‌బాబా తదితరులు పాల్గొన్నారు.
పదిజిల్లాలతో కూడిన తెలంగాణ, భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేయటంతో భద్రాచలంలో తెలంగాణ సంబురాలు అంబరాన్నంటాయి. భద్రాచలం డివిజన్ ప్రజలు ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. డివిజన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్, కొమరం భీం, భధ్ర మహర్షికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయంలో మొక్కులు తీర్చారు. స్థానిక ఎమ్యేల్యే కుంజా సత్యవతి రామాలయంలో సోనియా గాంధీ పేరు మీద అర్చనలు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు.
వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ పట్ల కేంద్రం ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తూ ఏన్కూర్‌లో పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు ఎన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కారేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణా సంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్లు బయ్యారంలో మణుగూరు మండల టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ విజయోత్సవాలు చేశారు. స్థానిక పీవీకాలనీలోని హోలీప్యామిలి పాఠశాల నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కాలనీలోని వీదులగుండా తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాకాల్చారు.అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పిల్లలకు స్థానికులు మిఠాయిలు పంపిణీచేశారు. మణుగూరు మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నారు. కార్యకర్తలు నాయకులు సంతోషంగా మిఠాయిలు పంచుకున్నారు.
ఆనంద హేల...
Published Sat, Dec 7 2013 4:51 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM
Advertisement
Advertisement