5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు: కమల్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఇవి జరగనున్నట్టు పేర్కొన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాలపై గురువారం జరిగిన కేబినెట్ కమిటీ భేటీ అనంతరం కమల్‌నాథ్ పాత్రికేయులతో మాట్లాడారు. అధికార వర్గాల కథనం మేరకు, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి సాధారణ, రైల్వే బడ్జెట్లను ఆమోదించుకునే అవకాశం ఉంది.
దీంతోపాటు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్, న్యాయవ్యవస్థ జవాబుదారీ, అవినీతి నిరోధక(సవరణ), పౌర సేవలు, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ తదితర బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వీటిలో అవినీతి నిరోధక(సవరణ) బిల్లును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో దీనికి అనుమతి లభించి తీరుతుందనేది విశ్లేషకుల భావన.