ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో కొందరు చట్టసభ్యులు ప్రైవెట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా లోక్‌సభలో 10 శాతం స్థానాలను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉందని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారి తీస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయస్సు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్‌సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు.
అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏమిటి?
శాసన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్‌లో రెండు రకాల బిల్లులను చట్ట సభ్యులు ప్రవేశపెడతారు. అవి ఒకటి పబ్లిక్ బిల్లు, మరోకటి ప్రైవేట్ బిల్లు. పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లును మంత్రి కాకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక.. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రమే ప్రవేశపెడతారు. అందుకే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లు అని కూడా పిలుస్తారు.
ప్రైవేట బిల్లు ప్రవేశపెట్టడానికి నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంటుంది. చట్ట సభ్యలు ఈ బిల్లును ముసాయిదా రూపంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ప్రైవేట్ బిల్లును శుక్రవారం రోజు మాత్రమే ప్రవేశపెట్టి చర్చ జరుపుతారు. పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మూడు ప్రైవేట్ బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం ముగ్గురు ఎంపీలు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు.
ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు కోరుతూ ప్రైవేట్ బిల్లు
బీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రైవేట్ సెక్టార్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ప్రైవెట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ప్రైవేట్ రంగంలోని విద్యాసంస్థలు, కనీసం 20 మందితో కూడిన పలు సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు.. పబ్లిక్ సెక్టార్‌లోనే అమలు అవుతున్న విషయం తెలిసిందే.
విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ బిల్లు
కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ ప్రైవేట్ విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పర్యవేక్షణ , నియంత్రణ కోసం ఓ రెగ్యూలేటరీ బోర్డును ఏర్పాటుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment