న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పరిపాలనలో సాయంగా నిలుస్తున్న టాప్ అధికారుల జీతాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆర్టీఐ కింద బయటపెట్టింది. అత్యధికంగా ప్రధానమంత్రి కార్యదర్శి భాస్కర్ ఖుబ్లే రూ. 2లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు.
చాలా మంది జాయింట్ సెక్రటరీలు రూ.1.7లక్షల జీతం అందుకుంటుండగా.. అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా రూ.1,62,500లను అందుకుంటున్నారు. వరుసగా ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. జాయింట్ సెక్రటరీల్లో అత్యధికంగా తరుణ్ బజాజ్ రూ.1,77,750లు నెలవారీ జీతంగా తీసుకుంటున్నారు.
అత్యల్పంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ.17వేలను వేతనాన్ని అందుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల వివరాలను పీఎంవో జూన్ 1నుంచి తన వెబ్ సైట్లో ప్రజలకు అందుబాలు ఉంచింది. ఆర్టీఐ ద్వారా ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని ప్రభుత్వమే వాలంటరీగా విడుదల చేస్తోంది. మన్మోహన్ సర్కారు కూడా పీఎంవో ఉద్యోగుల జీతభత్యాలను ప్రకటించిన విషయం తెలిసిందే.