నాగరాజుతో భార్య
అన్నానగర్ (చెన్నై): సాధారణంగా అందరికీ గుండె, ప్లీహ గ్రంథి ఎడమ వైపున, కాలేయం కుడి వైపున ఉంటాయి. కానీ.. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన నాగరాజు(38) అనే వ్యక్తికి మాత్రం గుండె, ప్లీహం కుడి వైపున, కాలేయం ఎడమ వైపున ఉన్నాయి. అంతేకాక ఊపిరితిత్తులు సైతం తలకిందులుగా ఉన్నాయట. అస్తమా, దగ్గు, అలసట వంటి సమస్యలతో చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నాగరాజుకు వివిధ పరీక్షలు చేసిన వైద్యులు అతడి శరీరంలో అవయవాలు ఇలా గందరగోళంగా ఉన్న తీరును చూసి విస్తుపోయారు.
కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా అవయవాల అస్తవ్యస్త అమరిక ఉంటుందని రోగిని పరిశీలించినడాక్టర్ రాజా వెంకటేష్ తెలిపారు. నాగరాజు గుండెలోని రెండు కవాటాలు పూర్తిగా దెబ్బతినడంతో అతడికి ముఖ్యమంత్రి సహాయ పథకం కింద కవాటాలను అమర్చామన్నారు. రోగి ఊపిరితిత్తులు సైతం తలకిందులుగా ఉండడం వల్ల కవాటాలను మార్చే శస్త్రచికిత్సకు వైద్యులు ఆరు గంటలకు పైగా శ్రమించినట్లు చెప్పారు.