
వేధింపులతో సగం చచ్చిపోయా!
- రిషితేశ్వరి మరో డైరీ లభ్యం
- గుంటూరు పోలీసులకు అందజేసిన తల్లిదండ్రులు
- అభిషేక్, ఆదిత్య సైతం ప్రేమ పేరుతో వేధించారు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. ఇప్పటికే ఒక డైరీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్‌లోని తమ ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ డైరీలోని 13 పేజీల్లో రిషితేశ్వరి తనను సీనియర్లు వేధించిన తీరును కళ్లకు కట్టినట్లు రాసుకుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి అనుభవించిన నరకయాతన గురించి డైరీలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. మొద టి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల గురించి రాసినప్పటికీ ఆ పేర్లు కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కాదని రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు.
తాజాగా బయటపడ్డ రెండో డైరీలో మాత్రం రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్‌ల పేర్లను రిషితేశ్వరి స్పష్టంగా రాసుకుంది. శ్రీనివాస్, జయచరణ్‌లు తమను ప్రేమించాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేసేవారని, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించారని డైరీలో పేర్కొంది. ఈ విషయం తెలిస్తే తన తండ్రి బాధపడతారనే ఉద్దేశంతో చెప్పలేకపోయినట్లు రాసుకుంది. సీనియర్లతో ప్రేమ వ్యవహారం కొనసాగించాలంటూ హనీషా తనపై పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిందని, తాను వినకపోయేసరికి వరుసకు అన్నయ్య అయిన జితేంద్రతో తనకు అక్రమ సంబంధం అంటగట్టి, రూమర్లు సృష్టించి, తీవ్రంగా వేధించారని డైరీలో రాసింది. అంతేకాకుండా మరో ఇద్దరు విద్యార్థులు అభిషేక్, ఆదిత్య కూడా తమను ప్రేమించమంటూ ప్రతిపాదించారని, దీంతో షాక్‌కు గురయ్యానని, ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయానని వెల్లడించింది. సీనియర్ల వేధింపులతో తాను సగం చచ్చిపోయినట్లు అయిందని పేర్కొంది. రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుంటూరు పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ డైరీలోని మరికొన్ని విషయాలు బయటపడాల్సి ఉంది.