పులులు చంపిన లేడికూన! | rishiteswari, turns prey to the wolves around | Sakshi
Sakshi News home page

పులులు చంపిన లేడికూన!

Published Tue, Aug 4 2015 5:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

పులులు చంపిన లేడికూన!

పులులు చంపిన లేడికూన!

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
పాపం.. పుణ్యం.. ప్రపంచమార్గం ఏమీ తెలియదు. మనుషులు, మనస్తత్వాలు అర్థం కావు. చుట్టూ ఉన్న మనుషులు అందరూ మంచివారేననే అమాయకత్వం. స్కూల్లో, కాలేజిలో అంతా సవ్యంగా ఉందనే భ్రమ. పరిస్థితులను అర్థం చేసుకోలేని తెలియనితనం.

ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల్లోంచి ఒకేసారి పెద్ద ప్రపంచంలోకి.. యూనివర్సిటీల్లోకి.. అంతా గందరగోళంగా కనపడుతుంది. అమాయకమైన నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. రోజుల్లో పరిస్థితులు తలకిందులవుతాయి. ఆప్తులుగా అనుకున్నవారు వెంటాడి వేధిస్తారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మనసు విప్పి చెప్పుకున్నవారు నట్టేట ముంచేస్తే ఏం చేయాలో అర్థం కాదు. రెండు పదులు కూడా సరిగా నిండని వయసులో ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అనిశ్చితిలో.. సీలింగ్ ఫ్యానో, పంట కాలువో, స్లీపింగ్ పిల్సో, దూసుకొచ్చే రైలో... ఏదో ఒకటి ఆసరా అయితే.. తప్పెవరిది? నిరుత్సాహంతో, నిర్వేదంతో, అవమానంతో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరిదా? తనకు భరోసా కల్పించలేకపోయిన.. తోటి విద్యార్థులదా, ఉపాధ్యాయులదా.. విద్యావ్యవస్థదా?

రిషితేశ్వరి డైరీలోని అంశాలు చాలా ప్రశ్నల్ని లేవనెత్తాయి. చిన్నతనంలో తాను అనుభవించిన ఒంటరితనం ఆ అక్షరాల్లో కనపడుతోంది. పిల్లల్ని ప్రేమగా పెంచితే సరిపోతుందా? ప్రేమగా పెంచడం అంటే ఏమిటి? ఆప్యాయంగా అడిగినవన్నీ కొనిపెడితే సరిపోతుందా! పిల్లల మనసులోని భావాలను పట్టించుకోవాలి కదా! ''నువ్వెందుకు, నేను చేసి పెడతాను.. నేను తీసుకొస్తాను.. నువ్వు ఇలా ఉండు.. నువ్వు ఆ పని చేయకు..'' ఇలా ప్రతి అడుగు తల్లిదండ్రుల పర్యవేక్షణలో కొనసాగితే.. బాహ్యప్రపంచం అనుపానులు తెలిసేదెప్పుడు.. తెలియకపోతే జరిగే అనర్థానికి ఎవరిది బాధ్యత? చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటుచేసి ప్రొటెక్ట్ చేస్తూ 18 సంవత్సరాల పాటు పెంచి ఒకేసారి అడవిలో వదిలిపెడితే పులులు, సింహాలు సంచరించే చోట లేడికూనకి ఎంత కష్టం!

రిషితేశ్వరి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న లేడికూనే. నమ్మిన మనిషి చేసిన ద్రోహం ఆ డైరీలోని అక్షరాల్లో కన్నీరై ప్రవహించింది. మంచేదో చెడేదో తెలుసుకోలేని అమాయకత్వం.. ఆ దుర్మార్గం ముందు తలవంచింది. చేయి వేస్తే ఆ చేయి నరికేయొచ్చనే హక్కు, ఆత్మగౌరవం తన సొత్తు అనే చిన్న విషయం కూడా తెలియని బేలతనం.. ''నాన్నకి ఎలా చెప్పను''.. అనే మధ్యతరగతి అభిమానం.. 'రిషితేశ్వరి' సమూహంలో కూడా ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న రిషితేశ్వరికి సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోడానికి, సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించే వ్యవస్థ లేకపోవడం మన విద్యావ్యవస్థలో ఉన్న లోపం.. రిషితేశ్వరి లాంటి లేడికూనల పాలిట శాపం. చదువు, పరీక్ష, ఫలితాలు, సర్టిఫికెట్లు తప్ప బతుకు పోరులో ఎదురయ్యే సమస్యల్ని వివరించి విడమరిచే వ్యవస్థ ఊసే లేకపోవడం అన్యాయమే.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవహరించే పద్ధతి ఒకటే.. విచారణ కమిటీ, నివేదిక. మా పని అయిపోయింది అని చేతులు దులుపుకొన్నట్లుగా పదో, పరకో విదిలింపు. ఇలాంటివి సహించం.. కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం లాంటి హుంకరింపులు. విద్యార్థులతో కలిసి తాగి చిందులేసిన గురువర్యులు అలాగే ఉంటారు. మాకెందుకులే జీతాలు వస్తే చాలనుకునే సాధారణ ఉపాధ్యాయులు అలాగే కొనసాగుతారు. రిషితేశ్వరి ఘటన కొద్ది రోజుల్లో మరుగున పడిపోతుంది. ఆమె చావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైనవారు అదే క్యాంపస్లో కాలరెగరేసుకుంటూ తొందరలోనే కనపడతారు. విచారణ కమిటీ నివేదికకు చెదలు పట్టేస్తాయి. ఇప్పుడు కాకపోయినా.. కొద్ది రోజులకైనా రిషితేశ్వరి హాస్టల్ రూమ్ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. అమాయకంగా బిక్కుబిక్కుమంటూ మరో పసికూన క్యాంపస్ మెట్లు ఎక్కుతుంది...
-ఎస్. గోపినాథ్ రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement