ర్యాగింగే రిషితేశ్వరి ప్రాణం తీసింది
సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణమని నిర్ధారణ అవుతోంది. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రహ్మణ్యం తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్టుగా సమాచారం. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వివరించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేసిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై సేకరించిన ప్రాథమిక ఆధారాలను వివరించారు.
అయితే వివరించిన అంశాలతో మధ్యంతర నివేదికను సమర్పించాల్సిందిగా సీఎస్ కమిటీకి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఎవరెవరు కారణమనే విషయాన్ని కూడా బాల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. రిషితేశ్వరి అమాయకురాలని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరెవరి చర్యలు కారణమనే వివరాలతో బాలసుబ్రహ్మణ్యం త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనున్నారు.