ప్రధానికి వైఎస్సార్‌సీపీ రైతు విభాగం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల విడుదలను పర్యవేక్షించడానికి స్వతంత్రంగా పని చేసే చట్టబద్ధ అధికారాలతో కూడిన కృష్ణా రివర్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం విజ్ఞప్తి చేసింది. ‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనేక చెక్‌డ్యామ్‌ల వద్ద అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న వేలాది పంపు సెట్లను నియంత్రించండి’ అని కోరింది. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి శనివారం ప్రధాని కార్యాలయానికి ఈ మేరకు ఐదు పేజీల లేఖ పంపారు. ‘‘కృష్ణా జలాల్లో డిపెండబిలిటీని 65 శాతానికి తగ్గించడం, 120 టీఎంసీల మిగులు జలాలున్నాయని నిర్ధారించడం అశాస్త్రీయం.
ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలే జలాలను, పాలేరు, మునేరు, వైరా, కట్టలేరు, బుడమేరు డైవర్షన్ నుంచి వచ్చే నీటిని అదనపు జలాలుగా పరిగణించడమూ అశాస్త్రీయమే. వీటిని తక్షణం సరిదిద్దాలి. మిగులు జలాల ఆధారంగా నిర్మించిన వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్బెల్బీసీ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు సమస్యను పరిష్కరించాలి. ఆల్మట్టి నిండి శ్రీశైలానికి ఆగస్టుకు గానీ నీరు రావడం లేదు. ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే అక్టోబర్ తొలి వారానికి గానీ నీళ్లు రావు. కాబట్టి దాని ఎత్తును నియంత్రించాలి. కేసీ కెనాల్, ఆర్డీస్‌లకు నీటికొరత రాకుండా చూడాలి’’ అని అందులో పేర్కొన్నారు.