మావి కాదు.. వారివే గాలిమాటలు!
న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ భేటీలో ప్రధానిమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించడంపై బీజేపీ స్పందించింది. సోనియా రాజకీయంగా తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భూ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గడం వెనుక రాహుల్ పోరాటం ఉందంటూ సోనియా ప్రశంసించడంపై.. ఇటీవలి అమేథీ భూ వివాదాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ‘అమేథీలో రైతుల భూమిని దురాక్రమించుకున్న కొడుకును భుజం తట్టి ప్రోత్సహించినట్లుగా’ ఉందన్నారు.
మోదీవి కావని, రైతుల పాలిట దేవుడిగా తనను తాను అభివర్ణించుకున్న రాహుల్ గాంధీవే అసలైన గాలి మాటలని విమర్శించారు. విశ్రాంత సైనికుల ఒకే హోదా.. ఒకే పెన్షన్ డిమాండ్‌పై 40 ఏళ్లు గాలిమాటలు చెప్పింది కాంగ్రెసేనన్నారు. యూపీఏ స్కామ్‌లను ప్రస్తావిస్తూ.. ‘ఖజానాను ఖాళీ చేసినవారు, దేశాన్ని తిరిగి అభివృద్ధి బాటన నిలిపిన మోదీని విమర్శించడం హాస్యాస్పదమ’న్నారు. రాహుల్ గాంధీని బీజేపీ పట్టించుకోబోదని చెబుతూ.. తాను అమేథీలో కేవలం 20 రోజులు ప్రచారం చేసి ఆయన మెజారిటీని చాలావరకు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు.