స్టాలిన్ సినిమాలో ఒకరి నుంచి ఒకరు సాయం పొందినట్లు చూపిన జనం
పాట్నా: బీహార్లో అచ్చం చిరంజీవి 'స్టాలిన్' సినిమాలో మాదిరి చేస్తున్నారు. సాయం పొందినవారు మరో ముగ్గురుకు సాయం చేయమని ఆ చిత్రంలో చిరంజీవి చెబుతారు. అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోతే లక్షల మందికి సాయం అందుతుంది. అయితే ఇక్కడ సాయం పొందినవారు కాకుండా అందరూ సాయం చేస్తున్నారు. జిల్లాలలో అన్ని కుటుంబాల వారు చేసే సాయం పేదల ప్రాణాలను నిలబెడుతుంది. ప్రభుత్వంపై ఆధారపడకుండా నిరుపేదలకు అత్యంత మెరుగైన వైద్యం అందించే ఓ అద్వితీయ కార్యక్రమం బీహార్లో చేపట్టారు. మంచి ఫలితాలను కూడా సాధిస్తున్నారు.
ఖైమూర్ జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సంస్థ వారు కలసి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. జిల్లాలోని ప్రతి కుటుంబం పది రూపాయల వంతున సాయం చేయాలి. జిల్లాలోని 4 లక్షల కుటుంబాల వారిని సాయం చేయమని అర్ధిస్తున్నారు. ఇలా అందిన సొమ్మును నిరుపేదల వైద్యం కోసం ఖర్చుచేస్తారు. ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చిన కొద్ది రోజులకే మంచి స్పందన లభించినట్లు ఓ అధికారి తెలిపారు.
ఈ విధంగా సాయం చేయడం ద్వారా ఒక జీవితాన్ని నిలబెట్టినవారవుతారని ఖైమూరు జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ కుమార్ సింగ్ చెప్పారు. డబ్బులేక వైద్యానికి దూరమైన పేదలకు చికిత్స కోసం ఓ కుటుంబం ఇచ్చే పది రూపాయలు వినియోగిస్తారని చెప్పారు. వైద్యం అందక చనిపోయే నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రతి కుటుంబం ఇచ్చే పది రూపాయల విరాళం నిరుపేదల బతుకులు నిలపడానికి వినియోగించాలన్నదే తమ లక్ష్యం అని జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి రామేశ్వర ప్రసాద్ సింగ్ చెప్పారు. విరాళాల సేకరణ కోసం పట్ణణాలలో, గ్రామాలలో నాలుగు లక్షల కూపన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన కొద్ది రోజులకే తాము ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వస్తున్నట్లు ఆయన తెలిపారు. వేల కుటుంబాల వారు విరాళాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రజల విరాళాలతో ఏర్పాటు చేసే ఈ ఫండ్ ద్వారా ఒక కొత్త శకం ఆరంభమైనట్లేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే పేదలు ప్రభుత్వ పథకాలపైన, ప్రభుత్వ ఆస్పత్రులపైన ఆధారపడవలసిన అవసరం ఉండదన్నారు.
ఆయా ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచడానికి, విరాళాలు సేకరణను పర్యవేక్షించడానికి బ్లాక్ డెవలప్మెంట్ అధికారులను, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ను కోరారు.