250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల ఎసాప్స్
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ తమ ఉద్యోగులతో పాటు అనుబంధ సంస్థల్లోని సిబ్బందికి భారీ నజరానాలు ప్రకటించింది. అర్హులైన 250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల విలువ చేసే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఎసాప్స్) ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక స్కీము కింద రిలయన్స్ క్యాపిటల్ లిస్టెడ్ షేర్లు, ఇతర అనుబంధ సంస్థల ‘ఫాంటమ్ షేర్లు’ ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో 6,46,080 షేర్లు రిలయన్స్ క్యాపిటల్‌వి, మిగతావి ఫాంటమ్ షేర్ల రూపంలో అనుబంధ సంస్థలవీ ఉంటాయి. భౌతిక రూపంలో కాకుండా ‘కల్పిత’ రూపంలో జారీ చేసే షేర్లను ఫాంటమ్ షేర్లుగా వ్యవహరిస్తారు.
ఇవి కల్పితమైనవే అయినప్పటికీ.. సంబంధిత కంపెనీ, ఆ షేర్లను జారీచేసినవారు విక్రయించదలిస్తే, మార్కెట్ విలువ ప్రకారం భవిష్యత్తులో చెల్లింపు చేయడం లేదా వాటి స్థానంలో వాస్తవ షేర్లను జారీచేయడం జరుగుతుంది. రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థలైన రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన వాటిల్లో అర్హులైన ఉద్యోగులకు ఎసాప్స్ లభిస్తాయి.
రిలయన్స్ క్యాపిటల్ నజరానా