హార్ధిక్ పటేల్పై ధ్వజమెత్తిన ఆర్ఎస్ఎస్
పటేల్ (పటీదార్) కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ రెండు నెలల కిందట ప్రారంభమైన ఉద్యమంపై ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) తొలిసారిగా స్పందించింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ పై తీవ్రస్థాయి విమర్శలు కురిపించింది. పటేల్ ఉద్యమం జరుగుతున్న తీరుపై మండిపడింది.
ఈ మేరకు ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య సంఘ్ వార్తాపత్రిక 'సాధన'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ అభిప్రాయాన్ని వెల్లడించారు. సామాజిక సమానత్వాన్ని సాధించేతవరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ స్పష్టంచేసింది. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, డిమాండ్ల కోసం పోరాడే హక్కు అందరికీ ఉంటాయని, అయితే ఒకరు చేసే ఉద్యమం వల్ల జాతీయ సమగ్రతకు ముప్పువాటిల్లుతుందనుకుంటే దానిని తప్పనిసరిగా ఖండించవలసిందేనని సంఘ్ పేర్కొంది.
'మా సత్తా ఏమిటో యావత్ భారతానికి చూపెడతాం.. రావణ లంకను తగలబెడతాం..' అంటూ హార్దిక్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరించిన ఆర్ఎస్ఎస్.. ఆ వ్యాఖ్యలు దేశభక్తులందరినీ ఆందోళనకు గురిచేశాయిని అంది. హార్దిక్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 25న అహ్మదాబాద్లో జరిగిన భారీ సభ, అనంతరం చెలరేగిన హింసలో 10 మంది మరణించడం లాంటి పలు అంశాలను కూడా మన్మోమన్ వైద్య ప్రస్తావించారు. కాగా, ఈ ఇంటర్వ్యూ పొందుపర్చిన 'సాధన' ప్రతి సెప్టెంబర్ 19న మార్కెట్ లోకి రానుంది. ఇంటర్వ్యూలోని వైద్య వెల్లడించిన అంశాలు ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలేనని మరో అధికార ప్రతినిధి ప్రదీప్ జైన్ స్పష్టం చేశారు.