గాంధీని పొట్టనపెట్టుకుంది ఆర్‌ఎస్‌ఎస్సే: రాహుల్
భివండీ, ముంబై, న్యూస్‌లైన్: మహాత్మాగాంధీని హత్య చేసింది ఆర్‌ఎస్‌ఎస్సేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ గురువారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్, థానే జిల్లా భివండీలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు.
‘‘ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులే మహాత్మాగాంధీని హత్య చేశారు. నేడు ఆ సంస్థకు చెందిన వారే(బీజేపీ) రాజకీయ లబ్ధి కోసం గాంధీ గురించి మాట్లాడుతున్నారు. వీరే నాడు సర్దార్ పటేల్, గాంధీని వ్యతిరేకించారు’’అని రాహుల్ అన్నారు. అధికారం కోసం బీజేపీ మతకలహాలను రాజేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే అభివృద్ధి చేస్తామంటున్న బీజేపీ హామీలపై సందేహం వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దాన్ని మూడు నెలల్లో చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.