సమైక్యం, అవిశ్వాసంతో దద్దరిల్లిన పార్లమెంటు
పార్లమెంటు దద్దరిల్లింది. ఒకవైపు సమైక్య నినాదాలు, మరోవైపు అవిశ్వాస మంటలతో రగిలిపోయింది. మంగళవారం ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంటులో సమైక్య నినాదాలు మిన్నంటాయి. రాజ్యాంగంలోని మూడో అధికరణాన్ని సవరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈలోపు ఇతర పక్షాలు కూడా సమైక్య నినాదాలు చేశాయి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వారు ఎప్పటిలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా, లేదా విభజించాలా అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
ఇలా ఉండగా ఈలోపు లోక్సభ స్పీకర్ మీరాకుమార్పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దీంతో యూపీఏ సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది వారికి ఊహించని విపత్తుగా ఎదురైంది. రాజ్యసభలో 2జీ స్పెక్ట్రం కేసుపై జేపీసీ నివేదిక మీద గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం నడుమ పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
స్పీకర్పై అవిశ్వాసం అంటే, ఒకరకంగా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైన శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో మరికొన్ని పక్షాలు కూడా యూపీఏకు జెల్లకొట్టే అవకాశం లేకపోలేదు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క మిజోరం మినహా మరెక్కడా కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో కూడా స్థానాలు గెలుచుకోలేకపోవడంతో మిగిలిన పార్టీలకు కూడా యూపీఏపై విశ్వాసం సడలిపోతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్పై అవిశ్వాసం ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనని యూపీఏ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.