
రూపాయి మరింత పతనం
రూపాయి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. బుధవారం ఉదయం కొద్దిసేపు పర్వాలేదనిపించినా, మళ్లీ కాసేపటికే దిగజారడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం ఓ సమయంలో డాలర్తో పోలిస్తే 64.68 వద్ద ట్రేడయింది. గత కొన్ని రోజుల ఇంట్రా డే రికార్డులతో పోల్చి చూసుకుంటే ఇది అత్యంత తక్కువ కావడం గమనార్హం. మధ్యాహ్నం చాలా సేపు దాదాపు 64.11 వద్ద ట్రేడయినా, తర్వాత మరింత పతనమైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్తో పాటు నిఫ్టీ కూడా దారుణమైన నష్టాలను చవిచూశాయి.
కానీ, ఈ పతనం ఇక్కడితో ఆగదని, ఒక నెల రోజుల్లో సుమారు 70 రూపాయల స్థాయికి దిగజారుతుందని డ్యూచ్ బ్యాంకు అంచనా వేస్తోంది. అలాగని ఇది శాశ్వతంగా అంతే స్థాయిలో ఉండిపోతుందని కూడా ఆవేదన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ సంవత్సరాంతానికల్లా మళ్లీ కోలుకుంటుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని డ్యూచ్ బ్యాంకు ఓ పరిశోధన చేసి మరీ తేల్చింది.
బుధవారం ఉదయం అమెరికన్ డాలర్తో పోలిస్తే 63.33 వద్ద ట్రేడయిన రూపాయి.. తర్వాత పమళ్లీ పడిపోయింది. మంగళవారం కూడా ఇంట్రా డేలో 64.31 వద్ద ట్రేడయ్యి అత్యంత దిగువ స్థాయికి వెళ్లింది. బుధవారం దానికంటే మించిపోయింది. ఇంట్రా డేలో 64.68 వరకు వెళ్లిపోయింది. సాధారణంగానే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తక్కువగా ఉంటుంది గానీ, ఇటీవలి కాలంలో అది మరింత దారుణంగా తయారైంది. సుమారు నెల రోజుల్లోనే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 70కి చేరుతుందని డ్యూచ్ బ్యాంకు అంచనా వేస్తోంది.
ఇక్కడి ఆర్థిక విధానాలేవీ రూపాయిని బలపరిచే విధంగా లేకపోవడం, మరోవైపు దేశానికి వచ్చే పెట్టుబడులు కూడా తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల రూపాయి జీవితకాల కనిష్ఠానికి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే భారతదేశం మళ్లీ 1991 నాటి ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థికమంత్రి చిదంబరం, ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ఆర్థికవేత్తలు దీన్ని ఖండిస్తున్నా, పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. రూపాయి విలువ దిగజారిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు నుంచి ప్రతి కొనుగోలుకు మరింత ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల మన దేశ ఖజానా మరింతగా డొల్లపోయే ప్రమాదం స్పష్టంగా ఉంది. చెల్లింపుల విషయంలో సంక్షోభం తలెత్తితే, గతంలోలా మళ్లీ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ దాన్ని అధిగమించాల్సి వస్తుంది.