సచిన్, రేఖ.. దొందూ దొందే
న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో, నియోజకవర్గ సంక్షేమం విషయంలో మన నేతల తీరు ప్రజలకు బాగా ఎరుక. కానీ, తమ తమ రంగాల్లో విశేష సేవలతో పెద్దల సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టిన విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ కూడా అచ్చమైన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తారని ఎవరూ అనుకొని ఉండరు. కానీ, తామూ ఆ తానులోని వారమే అన్నట్లు సచిన్, రేఖ పార్లమెంటు స్థానిక అభివృద్ధి నిధులను మురగబెడుతున్నారు. ప్రతీ రాజ్యసభ సభ్యుడు లేదా సభ్యురాలు దేశంలో ఏదేనీ ఒక జిల్లాను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుని స్థానిక అభివృద్ధి నిధులను ఆ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చిస్తుంటారు. ఇందుకోసం ప్రతీ సభ్యుడికి ఏటా రూ.5కోట్ల నిధుల కేటాయింపు ఉంటుంది. సచిన్ ముంబై సబర్బన్ జిల్లాను సచిన్ దత్తత తీసుకున్నారు. కానీ, ఒక్క రూపాయి ఖర్చు చేసింది లేదు. ఇక రేఖ అయితే ఏ జిల్లాను దత్తత తీసుకోలేదు. ఇద్దరి ఖాత్లాలోనూ చెరో రూ.10కోట్లు మూలుగుతున్నాయి.