
రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..!
- ఆరోతరగతి నుంచే ఒంటరితనం అనుభవించా
- చరణ్ ఒక ఇడియట్
- అన్న అని పిలిచినా అసభ్యంగా ప్రవర్తించాడు
- బీచ్కి వెళ్లి వస్తుంటే ఆటోలో పైశాచికంగా వ్యవహరించారు
- శ్రీనివాస్ను ప్రేమించాలని అనిశా ఒత్తిడి చేసేది
- యూనివర్సిటీలో నరకాన్ని డైరీలో రాసిన రిషితేశ్వరి
గుంటూరు:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్కు గురై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి రాసుకున్న డైరీ 'సాక్షి టీవీ' చేతికి చిక్కింది. ఆ డైరీలో ఆమె తాను అనుభవించిన చిత్రవధ మొత్తాన్ని వివరించింది. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె తన డైరీలో రాసుకుంది. మొదటి పేజీలో వ్యక్తిత్వ వికాసం గురించి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న అంశం గురించి రాసుకుంది. తాను ఆరోతరగతి నుంచే ఒంటరితనాన్ని ఫీలయినట్లు డైరీలో రాసింది. ఉద్యోగాల నుంచి అమ్మ, నాన్న రాత్రి 9 గంటల తర్వాత వచ్చేవారని, తాను స్కూలు నుంచి సాయంత్రం 4 గంటలకే వచ్చి ఒంటరిగా ఉండేదాన్నని డైరీలో రాసింది. చరణ్ ఒక ఇడియట్ అని రాసుకుంది.
యూనివర్సిటీకి వచ్చిన తర్వాత తాను నమ్మినవారంతా తనను మోసం చేశారని, అన్న అని పిలిపించుకునే యువకుడు కూడా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని రిషితేశ్వరి తన డైరీలో రాసుకుంది. స్నేహితులంతా సూర్యలంక బీచ్కి వెళ్లి.. ఆటోలో తిరిగి వస్తుండగా చాలా పైశాచికంగా వ్యవహరించారని ఆమె తెలిపింది. అనిశ తన వివరాలన్నింటినీ శ్రీనివాస్కు చేరవేసేదని, అతడిని ప్రేమించాలంటూ తనపై ఒత్తిడి చేసేదని రాసింది. తన డైరీ చదివి శ్రీనివాస్, చరణ్లకు చెప్పేదని కూడా అందులో తెలిపింది. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ తన ఒంటిపై చేయి వేశాడని, నాన్నకు ఏమీ చెప్పుకోలేక.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని డైరీలో రాసింది. యూనివర్సిటీలో తాను ప్రత్యక్ష నరకం అనుభవించినట్లు డైరీలో తెలిపింది.