'వాళ్ల పిల్లలు కీచకులుగా మారారు'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీచక పాలన కొనసాగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం విశాఖలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ సభ్యుల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కఠినంగా వ్యవహరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రిషితేశ్వరి విషయంలో విధిలేక ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేశారని అన్నారు. తహశీల్దారు వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్తో మాట్లాడి సెటిల్ చేశారని విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఛీటింగ్ చీఫ్ మినిస్టర్‌గా బిరుదు ఇవ్వొచ్చు' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్‌లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రోజా విమర్శించారు.