సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలన మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా అని ప్రశ్నించారు. 2017లో మహిళలు చంద్రబాబు పాలనలో తీవ్ర ఇబ్బందులను మీడియా సమావేశంలో రోజా వివరించారు.
'నాలుగు బడ్జెట్‌లు మారుతున్నాయిగానీ ఆడవాళ్ల తలరాతలు మారలేదు. రెండో సంతకం మద్యం షాపుల నిషేధానికి సంబంధించిన దస్త్రంపైనే పెడతానని అన్నారు. ఇప్పుడేమో మద్యపు ఏరుల్ని పారిస్తూ ఖజానా నింపుకోవడానికి రాత్రి 1గంట వరకు వైన్ షాపులు నడుపుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా పర్వాలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరం మనకొద్దని, ప్రత్యేక జీవో ఇచ్చిన చంద్రబాబు గుడులు అలంకరణ చేయొద్దని వైన్స్‌లు మాత్రం కళకళలాడేట్లు చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు ఎత్తివేసేందుకు వారికి రూ.14,204కోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ డబ్బు చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకున్న దానితో పోలిస్తే 1శాతం. కానీ, అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం మహిళలకు పంగనామాలు పెట్టారు.
ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు తమ గ్రామాల్లోకి అడుగుపెడతారా? ఎప్పుడు నిలదీద్దామా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా? పౌష్టికాహారం కోసం గర్భిణీలకు రూ.10 వేలు ఇస్తానని వారిని మోసం చేశారు. పేద మహిళలకు స్మార్ట్ ఫోన్‌లు ఇస్తానని అన్నారు. అన్యాయం జరిగిన ఐదు నిమిషాల్లో వారి ముందు వాలతానని చెప్పి మోసం చేశారు. న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు రిషితేశ్వరి కేసు ఎటూ తేలలేదు.
అనంతపురం జిల్లాలో సుదమ్మ అనే మహిళను కొంచెం పక్కకు జరిపి కట్టమన్నందుకు పయ్యావుల అనుచరులు ఎగిరెగిరి ఆమెను తన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై ఏపీలో జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు నేరస్తుల కోసం పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆఖరికి టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురుకి కూడా అన్యాయం జరిగిందంటే.. టీడీపీ పాలనలో ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు. టీడీపీలో రౌడీలు, గుండాలే రాజ్యమేలుతున్నారు. ఆడపిల్ల అంటే చంద్రబాబుకు గౌరవం లేదు, పట్టించుకోరు. జెర్రిపోతుల పాలెం ఘటనపై చంద్రబాబు కనీసం ఒక్క ప్రకటన చేయలేదు' అని రోజా చంద్రబాబు వల్ల జరిగిన అన్యాయాలు ఎండగట్టారు.
'2017 నారావారి నరకాసుర నామ సంవత్సరం'
Published Sun, Dec 31 2017 1:24 AM | Last Updated on Fri, Aug 10 2018 5:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment