జేబులో పేలిన శాంసంగ్ ఫోన్
న్యూయార్క్: దక్షిణ కొరియా కు చెందిన మొబైల్ మేకర్ శాంసంగ్ ను పేలుడు కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. చార్జింగ్ పెడుతున్న సమయంలో గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుడుతున్న ఘటనలతో ఆందోళనలో పడ్డ సంస్థకు ఇపుడు మరో వివాదం చుట్టుకుంది. వరుస ఘటనలు, రీకాల్ సంక్షోభానికి తోడు న్యాయపరమైన చర్యల్ని కూడా ఎదుర్కొంటోంది. జరిగిన జాప్యానికి, నష్టానికి, నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఫ్లోరిడాలోని పామ బీచ్ గార్డెన్స్ లో జోనాథన్ స్ట్రోబెల్ అనే వినియోగదారుని జేబులోనే గెలాక్సీనోట్ 7 పేలిపోయింది. పనిలో ఉండగానే అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సెకండ్ డిగ్రీ గాయాలతో ఉన్నాడని పాం బీచ్ పోస్ట్.కామ్ సోమవారం రిపోర్టు చేసింది. ఈ లోపం గురించి స్పష్టంగా ముందే తెలిసి వున్నా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ సుమారు కోటి రూపాయలు(15,000 డాలర్లు) నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దావా వేశాడు. శాంసంగ్ లాంటి కార్పొరేట్ సంస్థ తగిన చర్యలు చేపట్టడంలో విఫలమైందని జొనాధన్ లాయర్ వాదించారు. మరోవైపు ప్రమాదం తర్వాత జోనాథన్ కు ఫోన్ ను అప్పగించాల్సిందిగా శాంసంగ్ సంస్థనుంచి ఈమెయిల్ అందుకున్నాడు.
కాగా ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 పేలుడు ప్రమాదాలను ధృవీకరించిన శాంసంగ్ , ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలతో వినియోగాదారులను అప్రమత్తం చేస్తూ ఈమెయిల్స్ పంపుతోంది. దీంతోపాటు వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.