'గెలాక్సీ నోట్ 7' షాకింగ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తాజా వెర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 7కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ లో తలెత్తిన వైఫల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ఈ మోడల్ ఫోన్లన్నింటినీ త్వరలోనే రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన యాన్ హాప్ న్యూస్ అందించినసమాచారం ప్రకారం బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ వారాంతంలో వీటిని వెనక్కి పిలవాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.
అటు తమ వినియోగదారుల భద్రత తమకు అత్యంత ముఖ్యమనీ, వారికి ఎలాంటి ఇబ్బందీ రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ఫోన్లన్నీ రీకాల్ చేయనున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని శాంసంగ్ ప్రతినిది ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి శాంసంగ్ నిరాకరించింది. క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని...వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. తమ వినియోగదారులకు అత్యధిక నాణ్యత ఉత్పత్తులు అందించడంలో సంపూర్ణ నిబద్ధతతో ఉన్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
చార్జింగ్ పెట్టినపుడు ఈ ఐరిస్ స్కానర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈక్విటీపైనా ప్రభావం చూపింది. దీనిపై శాంసంగ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఫోన్లను పరీక్షిస్తున్నామని, తమ కస్టమర్లకు అత్యంత క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను మాత్రమే తాము అందిస్తామని వెల్లడించింది. మొత్తం షిప్పింగ్ చేసిన ఫోన్లలో 0.1 శాతం యూనిట్లలో మాత్రమే సమస్యలకు ఆస్కారముందని శాంసంగ్ మరో అధికారి తెలిపారు. ప్రతి సంవత్సరం, బ్యాటరీ పేలుళ్ల ప్రమాదాలు నమోదవుతున్నప్పటికీ, ఇంత తక్కువ వ్యవధిలో ఇదే మొదటి సారి అని షిన్హాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ విశ్లేషకుడు హా జూన్-డూ,వ్యాఖ్యానించారు. కాగా, భారత్ సౌత్ కొరియా, అమెరికాలో ఆగస్ట్ లో రూ. 65 వేల ధరతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే అదనపు భద్రతా తనిఖీల కారణంగా కస్టమర్లకు ఫోన్ల రవాణా ఆలస్యమైనట్టు తెలుస్తోంది.