పరిహారం కింద బన్సాలీ రూ.20 లక్షలిచ్చారు!
ముంబై : హిట్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్న పద్మావతి సినిమా షూటింగ్ సెట్లో మరణించిన వర్కర్ కుటుంబానికి ఆయన అందిస్తున్న నష్టపరిహారాన్ని మరింత పెంచారు. నష్టపరిహారం కింద రూ.20 లక్షలను అతని కుటుంబానికి అందించనున్నట్టు తెలిపారు. దీపికా పదుకొణే, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ నటీనటులుగా నిర్మితమవుతున్న పద్మావతి సినిమా వచ్చే ఏడాది దీపావళికి తెరపైకి రానుంది. ఈ మూవీ సెట్స్లో పెయింటర్గా పనిచేస్తున్న ముఖేష్ డాకియా ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ముఖేష్ కుటుంబాన్ని పరామర్శించిన బన్సాలీ ప్రొడక్షన్స్, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపింది.
అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగిందని, ప్రొడక్షన్ హౌజ్ నుంచి రూ.20,80,000 చెక్ను జారీచేస్తున్నట్టు బన్సాలీ ప్రొడక్షన్ హౌజ్ తెలిపింది. మరో రూ.2,20,000 చెక్ను ముఖేష్ వేతనంగా ఇస్తున్నట్టు అతని ప్రొడక్షన్ హౌజ్ చెప్పింది. మొత్తంగా బన్సాలీ ప్రొడక్షన్ నుంచి ఆ వ్యక్తి కుటుంబానికి రూ.23 లక్షల పరిహారం అందినట్టు ఫిల్మ్ స్టూడియోస్ సెట్టింగ్ అండ్ అలైడ్ మజ్దూర్ యూనియన్ అడ్వయిజర్ అశోక్ దుబే ఓ ప్రకటనలో తెలిపారు. సబర్బన్ గూర్గాన్ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్న సెట్లో ముఖేష్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. లంచ్ బ్రేక్లో కిందకి దిగేటప్పుడు అదుపుతప్పి కిందకి పడిపోయాడు. కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించే లోపలే మార్గం మధ్యలో అతను మృతిచెందాడు.