శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ చైర్మన్
శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ చైర్మన్
Published Tue, Jan 10 2017 2:57 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. దీనికి తోడు బ్యాంకులు, ఏటీఎంలో 2000 రూపాయలు నోట్లు ఇస్తుండటంతో చిల్లర సమస్య ఏర్పడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరో 6 నెలల సమయం పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య శుభవార్త చెప్పారు. మంగళవారం మీడియాతో అరుంధతి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.
‘పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్య త్వరలో తీరుతుందని నమ్ముతున్నాం. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్బీఐ ఖాతాదారులు నగదు కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదని వారికి హామీ ఇస్తున్నాం. సరిపడా డబ్బును బ్యాంకు బ్రాంచిలకు పంపిస్తాం. దీనివల్ల ఖాతాదారులు వారి అవసరాలకు తగినట్టు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నాం. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణిలోకి వస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. కరెన్నీ అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల రద్దుకు ముందు మాదిరే బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాం’ అని అరుంధతి చెప్పారు.
Advertisement
Advertisement