థియేటర్లకు సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్ల యజమానులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వినిపించాలని ఆదేశించింది. అలాగే ఆ సమయంలో స్క్రీన్లపై జాతీయ పతాకాన్ని చూపించాలని సూచించింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ గీతం, జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని వినిపిస్తున్న సమయంలో సినిమా థియేటర్లలో ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా లేచి నిలబడాలని సూచించింది. కాగా ప్రస్తుతం కొన్ని మాల్స్, థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపిస్తున్నారు.