సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు
ఫోన్‌కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు
హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సమయం వరకు సాయినాథ్ ఎవరితో మాట్లాడింది.. అసలు అతడి సెల్‌ఫోన్ ఎక్కడుంది అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు సాయినాథ్ ఉన్న కొంపల్లిలోని రామ్ రితేశ్ బాయ్స్ హాస్టల్‌కి వచ్చి అక్కడి విద్యార్థులను సాయినాథ్ గురించి ఆరా తీశారు. సాయినాథ్ తమతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసుల విచారణలో వారు వెల్లడించారు. ఆగస్టు 17న సాయినాథ్ అన్నయ్య రఘునాథ్ వచ్చి హాస్టల్‌లో చేర్పించారని హాస్టల్ నిర్వాహకురాలు అర్చన తెలిపింది. సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలలకు చెందిన 102 మంది విద్యార్థులు తమ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపింది.
సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశామని, అవి పని చేయడం లేదని, సాయినాథ్ ఇప్పటి వరకు తాను వచ్చి, వెళ్లే సమయాలను ఎప్పుడు ఎంట్రీ బుక్‌లో రాయలేదని పేర్కొంది. స్నేహితులకు చెప్పే సాయినాథ్ శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడనే విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించింది. మరోవైపు సాయినాథ్ ఆత్మహత్యపై పలువురు విద్యార్థులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులను విచారించనున్నట్లు సమాచారం.