కుత్బుల్లాపూర్: సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి సాయినాథ్(18) మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులుగా కళాశాలకు సెలవులు కావడంతో పోలీసులు సాయినాథ్ వినియోగించిన సెల్‌ఫోన్ కాల్‌డేటాపై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకునే వరకు ఎవరితో మాట్లాడింది.. అసలు సెల్‌ఫోన్ ఎక్కడుందన్న మిస్టరీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి. రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు కొంపల్లిలో ఉన్న రామ్ రితేష్ బాయ్స్ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను ఆరా తీశారు. డబుల్ బెడ్ రూంలో రఘవీర్, హర్షిత్, రణవీర్, శ్రీధర్, మూర్తి, హర్షిల్లాలతో పాటు సాయినాథ్ ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే అతడు తమకు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులతో వారు వెల్లడించారు. మొత్తం 102 మంది హాస్టల్‌లో ఉంటున్నారని, అందులో సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని సమాచారం.
స్నేహితులకు చెప్పి శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడన్న విషయం తమకు తెలియదని హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు తేలింది. దీనిపై ఇప్పటికే పలువురు విద్యార్థులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లో ఉన్న సీఎంఆర్ కళాశాలలో సీనియర్లను విచారించనున్నారు. మంగళవారం రాత్రి హాస్టల్‌లో సాయినాథ్ చనిపోయే ముందు రాసిన నోట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సాయినాథ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
Published Wed, Sep 2 2015 8:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement