పార్లమెంటులో రెండు గంటల పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నా
పార్లమెంటు సాక్షిగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజనను నిరసించారు. దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద మంగళ వారం ఉదయం ధర్నా చేశారు. వీరికి కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్్ రెడ్డి తదితరులు తమ మద్దతు తెలిపారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మంత్రులు సాకే శైలజానాథ్, పార్థసారథి, ఇంకా గాదె వెంకటరెడ్డి, వంగా గీత, కన్నబాబు తదితర ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ నినదించారు. దాదాపు రెండు గంటల పాటు వీరి నిరసన కొనసాగింది.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యూహం మార్చుకున్నారు. తొలుత జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తలపెట్టినా, అధిష్ఠానం మందలింపుతో తమ నిరసన వేదికను మార్చుకున్నారు. సోనియాగాంధీ హెచ్చరిక నేపథ్యంలో బహిరంగ ప్రదేశంలో కాకుండా.. పార్లమెంటు వేదికగానే తమ నిరసన తెలపాలని, అది కూడా తీవ్రస్థాయిలో ఉండేలా చూడాలని వారు నిర్ణయించుకుని, ఆ వ్యూహాన్ని అమలు చేశారు.
ఇందుకోసం ముందుగానే దాదాపు 60 మందికి పైగా పార్లమెంటు పాసులు తీసుకున్నారు. వీరిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అందరూ ఉన్నారు. పార్లమెంటు ఉదయం 11 గంటలకు సమావేశమైంది. అంతకంటే ముందుగానే వీళ్లంతా గాంధీ విగ్రహం వద్ద గుమిగూడి, భారీగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణం సమైక్య నినాదాలతో దద్దరిల్లింది.