ఐటీ షేర్ల దెబ్బకి మార్కెట్లు...
Published Mon, Dec 12 2016 9:53 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
హెచ్1బీ వీసాలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ఐటీ షేర్లు బేజారన్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో ఐటీ దిగ్గజ కంపెనీలు కుప్పకూలాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనంతో సోమవారం మార్కెట్లూ బలహీనంగానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల నష్టంలో 26,600 వద్ద, నిఫ్టీ 51.35 పాయింట్ల నష్టంలో 8,210 వద్ద కొనసాగుతోంది. వీసా దుర్వినియోగాలకు సంబంధించి వచ్చిన అన్ని రకాల అభియోగాలపై తాను అధికారం చేపట్టిన అనంతరం విచారణ జరిపిస్తానని ట్రంప్ వెల్లడించారు. దీంతో ట్రంప్ పాలనలో భారతీయులు సహా విదేశీయుల కార్మిక వీసాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను కంపెనీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ కంపెనీల షేర్లతో పాటు యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీలు సెన్సెక్స్లో నష్టాల్లోకి దిగజారాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు క్రూడ్ ఉత్పత్తిలో కోతకు సంబంధించి ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య మేజర్ ఒప్పందం కుదరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగిశాయి. ఎనర్జీ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ టాప్ నిఫ్టీ గెయినర్గా లాభాలు పండిస్తోంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.05 బలహీనంగా 67.41 వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement