
స్వల్ప లాభాలతో సరి
సోమవారం వెలువడనున్న అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై దృష్టిపెట్టిన మార్కెట్లు వారాంతం రోజున కొంత మందగించాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 130 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చివరకు 39 పాయింట్లు లాభపడి 20,997 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 19 పాయింట్లు పెరిగి 6,260 వద్ద స్థిరపడింది. నవంబర్ నెలకు శుక్రవారం రాత్రి వెలువడనున్న యూఎస్ ఉద్యోగ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని నిపుణులు పేర్కొన్నారు. హౌసింగ్, తయారీ రంగం, ఉద్యోగ గణాంకాల వంటి అంశాల ఆధారంగా ఈ నెల 17-18న సమావేశం కానున్న ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
దీంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంబించారని నిపుణులు తెలిపారు. కాగా, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగాయి. గురువారం రూ. 1,152 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 864 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 744 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సెన్సెక్స్‌లో టాటా పవర్ దాదాపు 6% జంప్‌చేయగా, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, హీరో మోటో, ఓఎన్‌జీసీ 3.6-1.3% మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, హెచ్‌యూఎల్, భారతీ 2-1% మధ్య నష్టపోయాయి.
చక్కెర షేర్లకు డిమాండ్
వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అధ్యక్షతన ఏర్పడ్డ మంత్రివర్గ బృందం(జీవోఎం) చక్కెర మిల్లులకు చేసిన బెయిలవుట్(ప్యాకేజీ) ప్రతిపాదన నేపథ్యంలో షుగర్ షేర్లు లాభాలతో తీపెక్కాయి. ప్యాకేజీలో భాగంగా చెరకు రైతుల బకాయిల చెల్లింపుల కోసం చక్కెర మిల్లులకు రూ. 7,200 కోట్లమేర బ్యాంకులు రుణాలందించేలా జీవోఎం ప్రతిపాదించింది. ఈ రుణాలకు 12% వడ్డీ మినహాయింపు(ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్) పథకాన్ని అమలు చేస్తారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా రుణాల పునర్వ్యవస్థీకరణ, పెట్రోల్‌లో 10% వరకూ ఇథనాల్‌ను మిక్స్ చేసేందుకు అనుమతించడం వంటి సూచనలు చేసింది. దీంతో షుగర్ షేర్లు ఓధ్ షుగర్, శక్తి, బజాజ్ హిందుస్తాన్, ధంపూర్, ద్వారకేష్, శ్రీ రేణుకా తదితరాలు 12-4% మధ్య దూసుకెళ్లాయి.