వెలుగులో ఐటీ రంగం
ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే సంచరించాయి. అయితే రోజు మొత్తంలో సెన్సెక్స్ 19,819-19,635 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 62 పాయింట్లు లాభపడి 19,804 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు బలపడి 5,850 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో సాఫ్ట్‌వేర్ షేర్లు వెలుగులో నిలిచాయి. వెరసి బీఎస్‌ఈలో ఐటీ రంగం అత్యధికంగా 2.1% పుంజుకుంది. మరోవైపు రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫెడ్ నిర్ణయాలు బుధవారం అర్థరాత్రి వెలువడనుండగా, శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
విప్రో హైజంప్
ఐటీ దిగ్గజాలలో విప్రో 5.5% జంప్‌చేయగా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ 4-2.5% మధ్య లాభపడ్డాయి. మిగిలిన దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్, సెసా గోవా, కోల్ ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్ 2-1% మధ్య పురోగమించాయి. మరోవైపు సన్ ఫార్మా 3.2% క్షీణించగా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ 2.3-1.2% మధ్య డీలాపడ్డాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు ప్రెస్టీజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, శోభా, యూనిటెక్ 5.5-1.5% మధ్య నీరసించాయి. ఇక పసిడి రుణాలపై రిజర్వ్ బ్యాంక్ తాజా నిబంధనల కారణంగా ముత్తూట్ ఫైనాన్స్ 8% పతనంకాగా, మణప్పురం ఫైనాన్స్ 4% పడింది. ఎఫ్‌ఐఐలు రూ. 318 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 501 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. కాగా, ట్రేడైన షేర్లలో 1,093 లాభపడగా, 1,249 నష్టపోయాయి.