లాభాల్లో ఐటీ జోరు
ముంబై: వరుస నష్టాలకు చెక్ పెట్టిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. అటు నిన్న మొన్నటి వరకు నేల చూపులు చూసిన ఐటీ సెక్టార్ జోష్ గా ఉంది. కీలక మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా కదులుతున్న మార్కెట్లలో మదుపర్లు ఐటీ రంగంలో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగం ఏకంగా 4.4 శాతానికిపైగా లాభపడుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని అందుకోనున్న అంచనాలు ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడం, డాలర్ 14 నెలల గరిష్టాన్ని తాకడం ప్రభావితం చేసిందని చెబుతున్నారు.
ఇన్ఫోసిస్ 5.41 శాతం. టీసీఎస్ 4.46 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.2 శాతం, టెక్ మహీంద్రా4.71 శాతం, కేపీఐటీ టెక్నాలజీస్ 4.27 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో మైండ్ ట్రీ, ఒరాకిల్ , విప్రో, టాటా ఎలక్సీ సైతం 3.7-2 శాతం లాభాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి.
కాగా ఆరంభంలోనే లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తున్నాయి. 26,119 259 పాయింట్లలాభంతో సెన్సెక్స్ వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 8,059 వద్ద పాజిటివ్ గా ఉన్నాయి. అటు రూపాయి కూడా నిన్నటి నష్టాలనుంచి కోలుకుని 68.46 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు పది గ్రా. 308 రూపాయల నష్టంతో రూ. 28,438 వద్ద కొనసాగుతున్నాయి.