మనవారే గానీ.. మనకు దూరం
మానవ ప్రపంచానికి దూరంగా ఎక్కడో వున్న ఆ ఆందమైన బీచ్‌లు, నీలి నీలి...మేఘాల్లా కనిపించే సముద్రపు అలలు, సమీపంలోనే ఉన్న దట్టమైన ఆ ఆడవులను ఆకాశ మార్గాన చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా అక్కడికెళ్లి తనవితీరా సేదతీరి రావాలని కోరిక కలగడం సహజం. కానీ అక్కడకెళ్లేందుకు సాహసిస్తే మాత్రం ప్రమాదం. ఏ పొదల మాటునుంచో దూసుకొచ్చే విషపూరిత బాణాలు గుచ్చుకొని ప్రాణాలు తీస్తాయి. ఆ బాణాలను ప్రయోగించేదీ మనవాళ్లే. మానవులే... కాకపోతే ఆది మానవులు. ప్రపంచంలోనే అతి పురాతన తెగగా, రాతియుగం నాటి మానవులుగా గుర్తింపుపొందిన వారు 60 వేల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు.
వారు నివసిస్తున్న దీవి ప్రపంచపుటంచుల్లో ఎక్కడో లేదు. భారతదేశంలోనే ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే చోటున్న అండమాన్ నికోబార్ దీవుల్లో భాగంగా ఉన్న ఉత్తర సెంటినెల్ దీవి అది. వారిని నాగరిక సమాజానికి దగ్గరగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆ ప్రాంతంలో విస్తారంగా దొరికే చేపల కోసం ఆశపడి వెళ్లి భారత మత్స్యకారులు బలైన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దీవికి మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఎవరూ వెళ్లరాదని భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మనం ఆ ఆదిమానవుల వద్దకు వెళితే మనకు కలిగే హాని కన్నా వారికి కలిగే హానే ఎక్కువని ఆది మానవ తెగల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ సంస్థ హెచ్చరిస్తోంది.
మానవ నాగరికతకు దూరంగా నివసిస్తున్న ప్రపంచంలో ఆదిమ తెగల్లోకెల్లా పురాతన తెగకు చెందిన వారు సెంటినెల్ దీవి వాసులేనని ఆ సంస్థ పేర్కొంది. ఆ తెగవారు ప్రస్తుతం వందల్లో ఉన్నారా, వేలల్లో ఉన్నారా అన్న విషయాన్ని నిర్ధారించి చెప్పలేకపోతున్నామని, 2004లో వచ్చిన సునామీలో చాలా మంది మరణించారని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్టీఫెన్ కారీ తెలిపారు.