వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర
24 నుంచి ఐదు రోజుల పర్యటన
32 కుటుంబాలకు పరామర్శ
పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తట్టుకోలేక వరంగల్ జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 24 నుంచి పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. యాత్ర మొదటి విడతలో భాగంగా ఐదురోజుల పాటు పర్యటించి 32 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24న ఉదయం 9 గంటలకు షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయల్దేరుతారు. శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ఉదయం 11 గంటలకు చేర్యాల చేరుకొని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేరోజు మరో ఆరు కుటుంబాలను పరామర్శిస్తారు.
మొదటి రోజు 154 కి.మీ. ప్రయాణం చేస్తారు. 25న రెండోరోజు 78 కి.మీ. ప్రయాణించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. 26న ఏడు, 27న ఏడు కుటుంబాలను కలుస్తారు. చివరి రోజైన 28న నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తం 619 కి.మీ. మేర ప్రయాణించి ఐదు నియోజకవ ర్గాల్లో పూర్తిగా, రెండు నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటిస్తారు’’ అని ఆయన చెప్పారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ మరణం తట్టుకొలేక అత్యధికంగా వరంగల్ జిల్లాలోనే చనిపోయారన్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్‌తబ అహ్మద్ మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులందరూ పరామర్శ యాత్రలో పాల్గొని విజయవంతం
చేయాలని కోరారు.