
రేపటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
- వరంగల్ జిల్లాలో మూడోదశ ములుగు నియోజకవర్గంలో ప్రారంభం
- రెండు రోజుల పాటు 11 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల
- అనంతరం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో మూడోదశ పరామర్శయాత్ర నిర్వహించనున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో రెండో రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని 11 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఆగష్టు 24 నుంచి 28వ తేదీ వరకు, సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు వరంగల్ జిల్లాలో రెండు విడతలుగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది. మూడోదశలో భాగంగా షర్మిల సోమవారం తొలిరోజు దోమగండి ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని కొండా రాఘవరెడ్డి తెలిపారు.
ఈ నెల 21న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి షర్మిల బయలుదేరి వెళతారు. ఆ రోజు ములుగు నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను, 22న ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం 22వ తేదీ సాయంత్రం పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాఘవరెడ్డి చెప్పారు. అదేరోజు మంథని నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారని, జిల్లాలో 23, 24 తేదీల్లో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.