కత్తి వాడటం రాదని వెక్కిరించింది.. అందుకే పొడిచా
కత్తి వాడటం కూడా రాదు.. అంటూ కరుణ తనను వెక్కిరించిందని, అందుకే తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఆమెను అన్నిసార్లు పొడిచానని ఢిల్లీ టీచర్ హంతకుడు సురేందర్ సింగ్ పోలీసులకు వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవని, ఏడాది నుంచే అవి చెడిపోయాయని పోలీసులు చెప్పారు. తర్వాత కొంత కాలానికి మళ్లీ సర్దుకుందని అనుకున్నా.. ఆమె ఫేస్‌బుక్ చూసి తాను ఒక్కసారిగా షాక్ తిన్నానని సురేందర్ అన్నాడు. ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ పాస్‌వర్డ్ తనకు తెలుసని, దాన్ని తెరిచి చూస్తే అందులో మోహిత్ అనే యువకుడికి ఆమె అభ్యంతరకరంగా ఉన్న తన ఫొటోలు పంపినట్లు, అతడితో బాగా సన్నిహితంగా చాటింగ్ చేసినట్లు ఉందని తెలిపాడు.
తాను ముందుగా కరుణ బ్యాగ్ మీద కత్తి ఆడించానని సురేందర్ చెప్పాడు. అయితే.. కత్తి ఎలా వాడాలో కూడా నీకు తెలియదంటూ ఆమె తనను వెక్కిరించిందని, దాంతో దాన్ని తాను చాలా బాగా వాడగలనని చూపించడానికే అలా పొడిచానని వివరించాడు. పైగా, ఆ తర్వాత పో్లీసులకు ఫోన్ చేసింది కూడా వేరే ఎవరో కాదు.. స్వయంగా సురేందరే ఫోన్ చేసి చెప్పాడు. నాలుగేళ్ల పాటు తనతో సన్నిహితంగా ఉన్న ఆమె.. వేరే యువకుడికి అలాంటి ఫొటోలు పంపడం చూసి తాను ఎంతో ఆవేదన చెందానని, దాని గురించి ఆమెను అడిగితే 'నా మీద గూఢచర్యం చేస్తున్నావా' అంటూ తిట్టిపోసిందని సురేందర్ తెలిపాడు.
తాను, కరుణ కలిసి ఉన్నప్పటి కొన్ని ఫొటోలను కూడా అతడు పోలీసులకు చూపించాడు. ఇద్దరి ఫేస్‌బుక్ అకౌంట్లలో కూడా ఆ ఫొటోలున్నాయి. సోషల్ మీడియాలో ఆదిత్య అనే పేరుతో సురేందర్ సింగ్ అకౌంట్లున్నాయి. 2012 నుంచి తామిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందని.. అయితే ఇటీవల మోహిత్ తనకు ఆమె బాగా తెలుసని చెబుతూ ఆమె పంపిన ఫొటోలు తనకు చూపించాడని, అవి చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయానని వివరించాడు. తర్వాత ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు పిలిచానని చెప్పాడు. వాళ్లిద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్లు చూడగా.. ఇద్దరూ హత్యకు ముందు గంట నుంచి అక్కడే ఉన్నట్లు తేలింది.