దేశ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భారతీయ జనతాపార్టీ ఎంపిక చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని శివసేన శుక్రవారం ముంబయిలో వెల్లడించింది. ప్రధాన పదవికి బీజేపీ ఎవరిని ఎంపిక చేసిన తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. శుక్రవారం ముంబయిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని తెలిపారు.
గత అర్థరాత్రి తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ మధ్య ఫోన్లో ఆ అంశంపై సుధీర్ఘంగా చర్చ జరిగినట్లు ఆయన వివరించారు. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య వచ్చిన సంభాషణలను వెల్లడించేందుకు నిరాకరించారు. 2017 వరకు తాను గుజరాత్ సీఎంగా ఉంటానని ఇటీవల నరేంద్రమోడీ చేసిన బహిరంగ ప్రకటనపై గత శనివారం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వచ్చిన విషయాన్ని విలేకర్లు ఈ సందర్బంగా సంజయ్కు గుర్తు చేశారు.
కాగా ఆ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశం బీజేపీ అంతర్గత విషయంగా సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా సుష్మాస్వరాజ్ను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఊహగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే.