మా సినిమా ఎవరి సెంటిమెంట్స్‌ను దెబ్బతీయదు!
ముంబై: పరమశివుడి మానవీయ అంశాలు ఆధారంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ రూపొందించిన తాజా చిత్రం 'శివాయ్'. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ మతం మనోభావాలను దెబ్బతీయబోదని ఆయన పేర్కొన్నారు. ఇందులో తాను శివుడి పాత్రను పోషించడం లేదని, కేవలం శివుడి భక్తుడిగానే తాను కనిపిస్తానని దేవ్‌గన్ చెప్పారు.
'సినిమాలో ఎలాంటి మతకోణం లేదు. నేను శివుడి పాత్రను పోషించడం లేదు. ఆయన భక్తుడైన ఓ సామాన్యుడిలా కనిపిస్తాను. శివుడిని ఆత్మలో నిలుపుకొన్న పాత్ర ఇది. అలాగే, ఈ సినిమాలో శివుడిలాగా నేను ధ్యానం చేస్తూనే, ప్రార్థన చేస్తూనో కనిపించను. కానీ నా శరీరం నిండా శివుడి పచ్చబోట్లు ఉంటాయి' అని 47 ఏళ్ల అజయ్ దేవ్‌గన్ చెప్పారు. 'శివాయ్' సినిమా ట్రైలర్‌ను తాజాగా ఇండోర్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
'ఒక్క శివుడు తప్ప మిగతా దేవుళ్లందరూ ఏ తప్పులు చేయనివారు. శివుడు మాత్రం అన్ని తప్పులు చేస్తాడు. పొగ తాగుతాడు. 'భంగ్' (మద్యం) సేవిస్తాడు. తనకు కోపం వచ్చిందే ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. శివుడిది చాలా మంచి మనస్సు కానీ, కోపం వస్తే తట్టుకోలేం. శివుడిని మామూలు మనుషులు సైతం మోసగించగలరు. ఇవన్ని సహజంగా మనుష్యుల్లో ఉండే గుణాలు. ప్రస్తుత తరంలో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన దేవుడు శివుడు' అని అజయ్ దేవ్‌గన్ పేర్కొన్నారు.