హెడ్మాస్టారి కొడుకు.. సీరియల్ రేపిస్టు!
ఢిల్లీలో ఎంఎన్సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నిందితుడు శివకుమార్ యాదవ్.. ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా రాంనగర్ గ్రామంలో ఓ హెడ్మాస్టారి కొడుకు. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్లుగా అతగాడు సీరియల్ రేపిస్టుగా తయారయ్యాడు. అతడి మీద చాలా అత్యాచారయత్నం కేసులున్నాయి. గూండా చట్టం, ఆయుధాల చట్టం కింద కూడా పలుమార్లు బుక్కయ్యాడు. తాగి గొడవలు చేయడం అతడికి ఎప్పుడూ ఉన్న అలవాటే. శివకుమార్ యాదవ్ గురించి ఏమాత్రం కొంచెం విచారించినా.. అతడికి ఉద్యోగం ఇవ్వడం కాదు కదా, కనీసం దూరం నుంచి పలకరించే సాహసం కూడా ఎవరూ చేయరు.
రాంనగర్ గ్రామంలో శివకుమార్ వస్తున్నాడంటే చాలు.. అమ్మాయిలను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిందిగా చెబుతారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అమ్మాయిల దుపట్టాలు లాగడం, ఇంకా అవకాశం ఉంటే మరింత దారుణాలకు తెగబడటం అతడికి అలవాటు. ఇతడి ఆగడాలను భరించలేక కొన్నేళ్ల క్రితమే పోలీసులు అతడిని జిల్లా నుంచి బహిష్కరించారు.
శివకుమార్ యాదవ్ తండ్రి రామ్నాథ్ యాదవ్ (76) స్థానిక మునిసిపల్ హైస్కూల్లో హెడ్మాస్టారిగా చేసి రిటైరయ్యారు. ఆయన చాలా మంచివారని, ఇప్పుడు తన కొడుకు చేస్తున్న దురాగతాలకు చాలా బాధపడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆయన ఎప్పుడో తన కొడుకును ఇంటినుంచి తరిమేశారు. తన కొడుకు చేస్తున్న పనులకు సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నానని, దీనికంటే చనిపోతే బాగుండునని అతడి తల్లి గంగశ్రీ వాపోయారు.