చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభం | Shooting for Chiranjeevi's 150th film begins | Sakshi
Sakshi News home page

చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభం

Published Thu, Jun 23 2016 3:28 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

Shooting for Chiranjeevi's 150th film begins


ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొలిరోజు ప్రారంభమైంది. దీంతో మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మెగా అభిమానుల్లో హుషారు పెంచుతూ  ల్యాండ్ మార్క్ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురువారం ఉదయం మొదలైంది. చిరంజీవి తొలిరోజు షూటింగులో అడుగుపెట్టారు. ఆయన వెంట అల్లు అరవింద్ కూడా ఉన్నారు. మేకప్తో ఎంటరైన చిరంజీవి మునుపటిలానే అదే జోష్తో సెట్లో సందడి చేశారు. దీంతో రెగ్యులర్ షూటింగ్ షురూ అయినట్లే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది.  చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ను చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, అలీ పాల్గొనగా టాకీ పార్టుకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ వచ్చే నెల 12వరకూ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో సన్నివేశాలు చిరంజీవి గారి అభిమానులకు కానీ, థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కానీ చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా ఆయన గ్లామర్ చూసి చాలా ముచ్చటపడిపోతారు. అంత గ్లామర్గా ఉన్నారు. ఇక సినిమాలో పరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా ఉంటారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తారు. చిరంజీవి గారి కొత్త లుక్తో కూడిన టీజర్ని కూడా అభిమానుల కోసం త్వరలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ భారీ షెడ్యూల్ ఉంటుంది.  ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్ ఎంటర్ అవుతుంది.

ఠాగూర్ తర్వాత చిరంజీవి గారితో మళ్లీ చాలా ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. ఇది ఆయనకు 150వ సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నా.  ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్,  ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు. ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు.

వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. టైటిల్ని త్వరలోనే ప్రకటిస్తాం. చరణ్ ఈ సినిమాని భారీగా నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. మంచి కథ, మంచి టెక్నీషియన్లతో సెట్స్ కొచ్చాం. అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా వస్తుందని ధైర్యంగా చెప్పగలను.... అన్నారు.' ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement