
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు
సింగపూర్: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలోని రెండు ఇంజిన్లలో విద్యుత్ సరఫరా ఆకస్మాత్తుగా ఆగిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది. పైలట్లు కంగారు పడతారు. ప్రయాణికులు ముచ్చెమట్లు పడతాయి. అసలే గాల్లో ఉన్న ప్రాణాలు అటునుంచి అటే ఎగిరిపోతాయి. సరిగ్గా అలాంటి పరిస్థితే గత శనివారం సింగపూర్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న 194 మందికి ఎదురైంది.
ఇక వివరాల్లోకి వెళ్లితే 182 మంది ప్రయాణికులు ... 12 మంది సిబ్బంది మొత్తం 194 మందితో ఎస్క్యూ 836 సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం సింగపూర్ నుంచి చైనాలోని షాంఘై బయలుదేరింది. విమానం బయలుదేరిన దాదాపు 3.5 గంటల అనంతరం 39 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలోని రెండు ఇంజన్లల్లో తత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ విషయం తెలిసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంతలో పైలట్లు వెంటనే అప్రమత్తమై... విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో వారు సఫలీకృతులయ్యారు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10.56 గంటలకు షాంఘై ఎయిర్పోర్ట్లో దిగింది. ఆ తర్వాత విమాన ఇంజన్లను ఎయిర్ పోర్ట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి లోపం లేదని ఉన్నతాధికారులు నిర్థారించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్ లైన్స్ సమీక్ష సమావేశం నిర్వహించింది.