
12 మంది ఎమ్మెల్యేల అరెస్టు.. ఎవరిపై ఏ కేసులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 12 మంది ఎమ్మెల్యేలపై రకరకాల కేసులు నమోదయ్యాయి. తమవాళ్ల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలనే వేధిస్తున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చివరకు ప్రధానమంత్రి మోదీ తనను చంపిస్తారేమో అని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఈ కేసుల వివరాలన్నీ చూస్తే ఇందులో ఎమ్మెల్యేల సొంత భార్యలు పెట్టిన గృహహింస కేసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా తప్పుడు ఫిర్యాదులే అంటారో.. ఏమో కేజ్రీవాలే తేల్చుకోవాలి. ఏయే ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో అరెస్టయ్యారో, ఎవరి మీద ఎలాంటి కేసులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
1) శరద్ చౌహాన్
ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న కేసులో సంబంధం ఉందని శరద్ చౌహాన్ను జూలై 31న అరెస్టు చేశారు.
2) అమానతుల్లా ఖాన్
ఓ మహిళను అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించినందుకు అమానతుల్లా ఖాన్ను జూలై 24న అరెస్టు చేసి, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు.
3) రాజేష్ రిషి
రాజేష్ తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసినందుకు ఆమెను బెదిరించి డబ్బు తీసుకోవడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరాల కింద ఈయనపై కేసు పెట్టారు.
4) నరేష్ యాదవ్
మాలెర్కొట్టా పట్టణంలో మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టిన ఘటనతో సంబంధం ఉందని యాదవ్ను జూలై 24న అరెస్టు చేశారు.
5) ప్రకాష్ జర్వాల్
ఓ మహిళపై దాడిచేసి, ఆమెను లైంగికంగా వేధించిన కేసులో జూన్ మొదటివారంలో ఈయనపై కేసు పెట్టారు.
6) సోమనాథ్ భారతి
తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ భార్య గృహహింస చట్టం కింద ఫిర్యాదుచేయడంతో 2015 సెప్టెంబర్లో సోమనాథ్ భారతిని అరెస్టు చేశారు. ఓ మహిళపై దాడి చేయడానికి తన అనుచరులను ప్రేరేపించినందుకు జూలై నెలలో మరోసారి ఈయనపై కేసు పెట్టారు.
7) మనోజ్ కుమార్
భార్య గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఈయనను విచారణకు పిలిచింది. అలాగే, భూకుంభకోణం కేసు కూడా ఈయనపై నమోదైంది.
8) దినేష్ మోహనియా
మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు, 60 ఏళ్ల వృద్ధురాలిని చెంపమీద కొట్టినందుకు ఈయనను జూన్లో అరెస్టుచేశారు. తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు.
9) మహీందర్ యాదవ్
ఓ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వోద్యోగిపై దాడి చేసినందుకు ఈయనను 2016 జనవరిలో అరెస్టుచేసి, బెయిల్ మీద విడుదల చేశారు.
10) అఖిలేష్ త్రిపాఠీ
2013 నాటి దాడి చేయడం, నేరపూరితంగా భయపెట్టడం కేసులో ఈయనను 2015 నవంబర్లో అరెస్టు చేశారు.
11) సురీందర్ సింగ్
ఎన్డీఎంసీ కార్మికుడిపై దాడి చేసిన కేసులో ఈయనను 2015 ఆగస్టులో అరెస్టు చేశారు.
12) జితేందర్ సింగ్ తోమర్
నకిలీ డిగ్రీలు సమర్పించినందుకు 2015 జూన్లో అరెస్టు చేసి, బెయిల్ మీద విడుదల చేశారు.