
సోనియాకు మానవత్వం లేదు.. మోడీకి మచ్చ తొలగలేదు
'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
రాష్ట్రం విడిపోవడం ప్రజలకు ఇష్టం లేదని, అయినా కేవలం ఓట్లు.. సీట్ల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల పేరు చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలుసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పిన విజయమ్మను 'ఇండియా టుడే' పత్రిక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయమ్మ పలు కీలకాంశాలపై తన అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించారు.
ఇరుప్రాంతాల ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు రేపిందని, ప్రస్తుత దుస్థితికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆమె తెలిపారు. పైపెచ్చు, ప్రస్తుతానికి ఇంకా ఇది రాజకీయ నిర్ణయమే తప్ప ప్రభుత్వ నిర్ణయం కాదని స్వయంగా ఆర్థికమంత్రి చిదంబరం పార్లమెంటులో చెప్పినందున ఇంకా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము చిట్టచివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటామని, ఒకవేళ పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. తాము కోర్టుకు వెళ్తామని, అయినా దీనంతటికీ ఇంకా చాలా సమయం ఉందని ఆమె చెప్పారు. తమకు ఎన్నికలు, రాజకీయాల గురించిన ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలోను, హైదరాబాద్లోను జరుగుతున్న ఉద్యమంలో ఎక్కడా నాయకుల జోక్యం లేనే లేదని.. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రవాణా సంఘాలు.. ఇలా అన్ని వర్గాల వారు ఎవరికి వారు స్వచ్ఛందంగానే ఉద్యమంలో పాల్గొంటున్నారని విజయమ్మ గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే.. ఆంధ్రా ప్రాంత ప్రజలు పెట్టిన పెట్టుబడులు ఏమైపోవాలని.. పరిశ్రమలన్నింటినీ ఇక్కడినుంచి తరలించడం సాధ్యమయ్యే పనేనా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తుందని, కానీ కేవలం రాష్ట్ర ప్రజల్లో 8 శాతం మందే అక్కడ ఉంటారని విజయమ్మ తెలిపారు. కొత్తగా హైదరాబాద్ లాంటి నగరాన్ని అక్కడ సృష్టించడం సాధ్యమయ్యే పనేనా అని అడిగారు. ఉన్నత విద్యా సంస్థలను, రక్షణ పరిశోధన ప్రయోగశాలలను మళ్లీ అక్కడ ఏర్పాటు చేయడం కేంద్రానికి సాధ్యమవుతుందా అని నిలదీశారు. ఇలాంటి ఆలోచనలేవీ లేకుండా ఏపకక్షంగా విభజన నిర్ణయం తీసేసుకున్నారని ఆమె మండిపడ్డారు.
రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధి పొందుతామన్నది కూడా కాంగ్రెస్ భ్రమ మాత్రమేనని, రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ ఓడుతూనే వస్తోందని విజయమ్మ గుర్తుచేశారు. అసలు కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, అయినా వాళ్లు తమ అధిష్ఠానాన్ని కాదనలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. విభజన మూల్యం కాంగ్రెస్ ఎంతగా చెల్లించుకోవాల్సి వస్తుందో వేచి చూడాలన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని, ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకునే ప్రసక్తి లేదని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే, ఈసారి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం తమకు ఉందన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటుందన్న వదంతులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియట్లేదని, వాస్తవానికి కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్ గానీ, మరెవ్వరూ గానీ తమకు పొత్తు కోసం ఫోనే చేయలేదని ఆమె చెప్పారు. తన కుమారుడు గత 15 నెలలుగా జైల్లోనే ఉంటున్నారని, మామూలుగా అయితే ఎవరికైనా 90 రోజుల్లోనే బెయిల్ రావాల్సి ఉండగా, దర్యాప్తు పేరుతో సీబీఐ కావాలని ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటివరకు 2009లో ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసిన అఫిడవిట్లో ఉన్నవి తప్ప ఒక్క ఆస్తిని కూడా సీబీఐ గుర్తించలేకపోయిందని అన్నారు. అలాగే, సీబీఐ ఆరోపించినట్లు జగన్కు ఎలాంటి బినామీ ఆస్తులు కూడా లేవన్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందికీ తెలిసున్నదేనన్నారు.
సోనియాగాంధీని తాను కలిశానంటున్నది కూడా తప్పేనని, గతంలో 2010 జూన్ నెలలో తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమెవద్దకు వెళ్లడమే చిట్టచివరి సారని విజయమ్మ స్పష్టం చేశారు. జగన్ ఓదార్పు యాత్రకు అనుమతించాలని అప్పుడు కోరామని, తమ కుటుంబానికి మద్దతుగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. కానీ ఏమాత్రం మానవత్వం లేని ఆమె ఆ యాత్రకు అనుమతించలేదని అన్నారు.
సోనియాగాంధీ మళ్లీ పిలిచి, పార్టీలో చేరాలని కోరడం అనేది ఊహాత్మక ప్రశ్న మాత్రమేనని ఆమె తెలిపారు. ఒక తల్లిగా తనకు ఇదంతా చాలా బాధగా ఉన్నా, అదే సమయంలో మొండిగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. తన భర్త మరణం, కొడుకు జైలుకు వెళ్లడం.. ఈ పరిణామాలన్నీ చాలా శరవేగంగా జరిగిపోయాయని, ఇప్పుడు మాత్రం అన్నింటికీ తాను అలవాటు పడిపోయాయని తెలిపారు. పదిహేను రోజులకు ఒకసారి తాను జైలుకు వెళ్లి జగన్ను కలుస్తున్నానని, అతడి ధైర్యం, ప్రజల పట్ల ఉన్న అభిమానమే తనను ముందుకు నడిపిస్తున్నాయన్నారు.
మన లౌకిక సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటారని, కానీ బీజేపీ మాత్రం అలా ఉండట్లేదని విజయమ్మ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మోడీకి చాలా మంచి పేరుందని, ఆయన అభివృద్ధి పనుల గురించి తాను కూడా చాలా విన్నానని, కానీ గోధ్రా లాంటి మరకలు మాత్రం ఇప్పటికీ ఆయనకు చెరిగిపోలేదని అన్నారు. అందువల్ల తాము బీజేపీతో జతకట్టే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదన్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, కేవలం ఎన్నికల తర్వాత మాత్రమే వాటి గురించి నిర్ణయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి తమ లక్ష్యం అంతా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.