
ఎన్నాళ్లుగానో అమలుకు నోచుకోలేకపోయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో అమలుకు నోచుకోలేకపోయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు.
లోక్‌సభలో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, ఇదే అదనుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ఆమోదింపచేయాలని ఆమె కోరారు. బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించి చాలాకాలం అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ బిల్లు పార్లమెంటు ఆమోదానికి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.