
శబ్ద బ్రహ్మ డాల్బీ ఇక లేరు
శబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని సరికొత్త పుంతలు తొక్కించి.. అత్యంత స్పష్టమైన శబ్దాన్ని ప్రేక్షకులకు అందించిన రే డాల్బీ కన్నుమూశారు.
శబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని సరికొత్త పుంతలు తొక్కించి.. అత్యంత స్పష్టమైన శబ్దాన్ని ప్రేక్షకులకు అందించిన రే డాల్బీ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో అల్జీమర్స్ వ్యాధితో పాటు తీవ్రమైన లుకేమియా బారిన పడిన ఆయన ఇక ఈ లోకానికి సెలవంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ థియేటర్లో చూసినా డీటీఎస్ డాల్బీ అని వింటున్నవారంతా దాని సృష్టికర్త గురించి కూడా తెలుసుకోవాలి. అమెరికన్ ఆడియో కంపెనీ డాల్బీ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడైన రే డాల్బీ.. గురువారం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో మరణించారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్.కామ్ వెల్లడించింది.
సినిమా థియేటర్లలో అప్పటివరకు అస్పష్టంగా వినిపించే రణగొణ ధ్వనుల స్థానే అత్యంత స్పష్టమైన శబ్దాన్ని అందించడం కోసం ఆయన విప్లవాత్మకమైన పరిజ్ఞానాన్ని సృష్టించారు. 1971లో ఆయన స్టాన్లీ కబ్రిక్స్తో కలిసి 'ఎ క్లాక్ ఆరంజ్' అనే సంస్థను స్థాపించారు. స్టార్వార్స్, క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ లాంటి సినిమాలతో ఆయన ప్రతిభ లోకానికి తెలిసింది. మరణించే సమయానికి ఆయనకు 15360 కోట్ల రూపాయల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య డాగ్మర్ ఈ సంపద మొత్తాన్ని పొందుతారు. వారికి టామ్, డేవిడ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.