ఏం మాట్లాడాలో తెలియడం లేదు: గంగూలీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన బాలికపై సామూహిక అత్యాచార ఘటనను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా ఖండించాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 'ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇటువంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. బాలికపై గ్యాంగ్రేప్ ఘటన గుండెలు పిండేసే బాధాకర ఘటన. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి' అని బెంగాలీ వార్తా చానల్తో గంగూలీ అన్నాడు. రేపిస్టులకు సహాయపడే వారిని వదలకూడదని విజ్ఞప్తి చేశాడు.
కోల్కతాలో సామూహిక అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక కాలిన గాయాలతో మంగళవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. అక్టోబర్ నెలలో ఆమె రెండుసార్లు లైంగిక దాడికి గురవడంతో ఆత్మహత్యకు యత్నించిందని మొదట అనుకున్నారు. అయితే రేపిస్టులే తనపై కిరోసిన్ పోసి తగలబెట్టారని చనిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు పేర్కొందని పోలీసులు తెలిపారు. కాగా, తమకు బెదిరింపులు వస్తున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.