
చంద్రబాబుకు 'స్టేటస్' సెగ!
- విశాఖ పర్యటనలో మార్పు
- హోదా ఆందోళనలే కారణం
- మంత్రుల గంటా, అచ్చెన్నాయుడుతో భేటీ
విజయవాడ: ప్రత్యేక హోదా ఆందోళనల సెగ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తగిలింది. ప్రత్యేకహోదా కోసం వైజాగ్ హోరెత్తుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో మార్పు చేసుకోవాలని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు (గురువారం) సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు విశాఖ నగరానికి రావాల్సి ఉంది. కానీ వైజాగ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఆయన ఈరోజు హైదరాబాద్ వెళ్లి.. రేపు అక్కడి నుంచి విశాఖ రావాలని అనుకుంటున్నారు.
వైజాగ్ ఎలా ఉంది.. సీఎం ఆరా
వైజాగ్‌లో హోరెత్తుతున్న ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్‌లోని పరిస్థితులను ఆయన ఆరా తీశారు. హోదా ఉద్యమం పేరిట ఎవరూ రోడ్లమీదకు రాకుండా అడ్డుకోవాలని ఈ సందర్భంగా పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.