
దసరా వేడుకల్లో తొక్కిసలాట:33 మంది మృతి
పాట్నా: సరదాగా సాగాల్సిన దసరా ఉత్సవాలు బీహార్ రాజధాని పాట్నాలో విషాదాన్ని మిగిల్చాయి. ఇక్కడి చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో శుక్రవారం దసరా ఉత్సవాల ముగింపు సమయంలో జరిగిన తొక్కిసలాటలో 33 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు శనివారం ఆస్పత్రిలో మరణించారు. గాయాల పాలైన 29 మంది స్థానిక పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 21 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. గాంధీ మైదాన్‌లో ఈ వార్షిక ఉత్సవాలకు వేలాది మంది హాజరయ్యారు. సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన రావణ దహనం అనంతరం ప్రజలు తిరిగి వెళ్లే సమయంలో తోపులాట మొదలై తొక్కిసలాటకు దారితీసింది. హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడిందనే వదంతులు వ్యాపించడంతో జనంలో అలజడి మొదలైందని ఓ ప్రతక్ష సాక్షి చెప్పారు. అయితే ఊపిరి ఆడకపోవడంవల్ల ప్రాణహాని జరిగిందని పాట్నా జిల్లా కలెక్టర్ తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజి ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.
రాష్ట్రపతి సంతాపం..పాట్నా ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్రం నుంచి అన్నివిధాల సహాయం అందిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీహార్ ముఖ్యమంత్రికి తెలిపారు. కాగా, తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ నినదించాయి. మాంజీ ప్రభుత్వంలోని పాలనా లోపాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది. ఇతర ప్రతిపక్షాలు సరైన సౌకర్యాలు కల్పించడంలో బీహార్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ విమర్శించారు.