ఎస్‌బీఐతో విలీన బాటలో ఎస్‌బీహెచ్ చివరిది!
చెన్నై: మాతృ సంస్థ- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో రాబోయే రోజుల్లో విలీనమయ్యే మొదటి అనుబంధ బ్యాంక్- ఎస్‌బీహెచ్ కాబోదన్న అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం ఇక్కడ ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంతరావు విలేకరుల వద్ద మాట్లాడుతూ, ఈ అంచనాలను వెలువరించారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇప్పట్లో ఎస్‌బీహెచ్ విలీనం జరిగే అవకాశం లేదన్నది తన అభిప్రాయమని తెలిపారు.
బహుశా విలీన బాటలో ఎస్‌బీహెచ్ చివరన నిలుస్తుందని ఆయన అంచనావేశారు. ఎస్‌బీహెచ్ త్వరలో ఐదు మహిళా బ్యాంక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. అక్టోబర్ 2న హైదరాబాద్, విశాఖ సహా బెంగళూరు, పుణే, సేలమ్‌లలో ఈ బ్రాంచీలు ఏర్పాటవుతున్నట్లు వెల్లడించారు. దక్షిణాదిలో మరింత విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌బీహెచ్ జోనల్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఆయన ఇక్కడకు వచ్చారు