రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనది
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భేటీ కానుంది. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనదన్నారు. మొదటి ఎస్సార్సీ ఆధారంగా రెండు అసెంబ్లీల తీర్మానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. విభజన వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఇబ్బంది పడతాయన్నారు.
ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే విభజన అంశాన్ని తెరమీదక తెచ్చారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్య రాష్ట్రమేనని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రుల బృందం చెబుతున్న విధానాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను విడగొట్టడానికి తప్ప సమైక్యంగా ఉంచడానికి కావని మైసూరా మండిపడ్డారు. జల వివాదాలకు సంబంధించి కేంద్ర జల వనరుల మంత్రి చైర్మెన్ గా ఇరు ప్రాంతాల సీఎంలు, కార్యదర్శలతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరిస్తారనడం వెర్రి ఆలోచన అన్నారు. జీవోఎంతో చర్చల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంవి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు పాల్గొననున్నారు. సీపీఎం కూడా జీవోఎంతో భేటీ కానుంది.